ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల ధాటికి ధాటికి బంగాల్‌లో 26 మంది మరణించారు. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. పిడుగుల ధాటికి మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిని చికిత్స నిమిత్తం జంగీపూర్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో ముర్షిదాబాద్ జిల్లాలో 9మంది, హుగ్లీలో 11 మంది మరణించారు. మెదీనిపూర్ జిల్లాలో నలుగురు, బంకురలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కోల్‌కతా సహా దక్షిణ బంగాల్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ముంచెత్తింది.
మోదీ సంతాపం..
ఈ మరణాలపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మరణించినవారి బంధువులకు తక్షణ సాయంగా రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
"బంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల కారణంగా ఆత్మీయులను కోల్పోయిన వారిపట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. నా ఆలోచనలన్నీ వారితోనే ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా."
-ప్రధాని మోదీ
బంగాల్‌లో మెరుపులు, పిడుగుల కారణంగా మరణించిన వారికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
"బంగాల్లోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన పిడుగుల వల్ల కలిగిన ప్రాణనష్టం బాధ కలిగించింది. ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు హృదయపూర్వకంగా సంతాపం తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ఇవీ చదవండి: ఝార్ఖండ్లో పిడుగులు పడి ఐదుగురు మృతి