గోవా వైద్య కళాశాల ఆస్పత్రిలో మరో విషాదం జరిగింది. మరో 15 మంది కొవిడ్ రోగులు.. గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు బొంబాయి హైకోర్టుకు గోవా ప్రభుత్వం తెలిపింది. రెండు రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో 4 గంటల వ్యవధిలో 26 మంది కరోనా రోగులు మృతి చెందటం గమనార్హం.
ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లలో సమస్యలు తలెత్తడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ అధికారులు తెలిపినట్లు బొంబాయి హైకోర్టులోని గోవా బెంచ్ చెప్పింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయం ఏర్పాటు చేయాలని తాము ఇదివరకే ఆదేశించినప్పటికీ.. గురువారం ఉదయం 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ఘటన జరిగిందని పేర్కొంది.
ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా అందకే రెండు రోజుల క్రితం.. కొవిడ్ రోగులు మృతి చెందారనే ఫిర్యాదులపై హైకోర్టు విచారణ చేపట్టింది. గోవాలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున.. రాష్ట్రానికి కేటాయించిన కోటాను త్వరగా చేరుకునేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని తెలిపింది. ప్రతి రోగికి మెడికల్ ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి: వ్యాక్సినేషన్‌కు కొత్త రూల్స్- మీరూ తెలుసుకోండి!