రాజస్థాన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో(Rajasthan cabinet news) భాగంగా 15 మంది మంత్రులు ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు 15 మంది ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశారు రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా. ఈ క్రమంలో నూతన ఎమ్మెల్యేలు, మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు దోతస్రా.
ముగ్గురు మంత్రులకు కేబినెట్ హోదా కల్పించనున్నట్లు తెలిపారు. కొత్త మంత్రివర్గంలో ఎస్సీ వర్గం నుంచి నలుగురికీ, ఎస్టీ సామాజిక వర్గం నుంచి ముగ్గురికి అవకాశం ఇవ్వనున్నారు.
పైలట్ వర్గానికి పెద్ద పీట
నూతన మంత్రివర్గంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన ఐదుగురు ఏమ్మెల్యేలు హేమరామ్ చౌదరీ, మురారిలాల్ మీనా, జహిదా ఖాన్, రాజేంద్ర సింగ్, బ్రిజేంద్ర ఓలాలకు అశోక్ గహ్లోత్ కేబినేట్లో చోటు కల్పించనున్నారు.
12 మంది కొత్తవారికి..
మరోవైపు.. నూతన కేబినెట్లో 12 మంది కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాజీనామాలకు ముందు మొత్తం మంత్రుల సంఖ్య 21. సీఎం సహా గరిష్ఠంగా 30 మందిని కేబినెట్లోకి తీసుకునే వీలుంది.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశం జరగనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పాయి. రాజస్థాన్ గవర్నర్ నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముందని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: రాజస్థాన్ కేబినెట్ మంత్రుల రాజీనామా