దేశంలో జనాభా పెరుగుతున్న కొద్దీ ఇళ్ల స్థలాల పరిమితికి ఇక్కట్లు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మహానగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో శౌచాలయాలు నిర్మించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. అయితే తన వినూత్న ఆలోచనతో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు యత్నించింది ఓ పదమూడేళ్ల చిన్నారి. హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ జిల్లాకు చెందిన సుదీక్ష ఠాకూర్ ఓ 'స్మార్ట్ వాష్ రూమ్' నమూనాను రూపొందించి అందరి మన్ననలు పొందుతోంది.
రెండు విధాలుగా....
ఈ స్మార్ట్ వాష్ రూమ్‌ను రెండు విధాలుగా ఉపయోగించేలా రూపొందించింది సుదీక్ష. శుభ్రతతో పాటు, సదుపాయాలు సౌలభ్యంగా ఉండేలా దీన్ని తయారు చేసింది. ఇండియన్, వెస్టర్న్ విధానాల్లో ఈ శౌచాలయాన్ని ఉపయోగించొచ్చని చెబుతోంది.
సుదీక్ష ఠాకూర్ తయారు చేసిన ఈ స్మార్ట్ వాష్ రూమ్ నమూనా... జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం విశేషం.
వాషింగ్ మెషీన్‌తో పాటు గీసర్ కూడా...
శౌచాలయం చిన్నగా ఉన్నా దాన్ని పలువిధాలుగా ఉపయోగించేలా అభివృద్ధి చేసింది దీక్షిత. దాదాపు 16 చదరపు అడుగుల స్థలంలోనే దీన్ని నిర్మించుకోవొచ్చని చెబుతోంది. మినీ వాషింగ్ మెషీన్, గీసర్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం గమనార్హం.
స్క్వాట్ టాయిలెట్ షీట్‌పై ఓ కప్పును ఏర్పాటు చేసుకునేలా నమూనాను రూపొందించింది దీక్షిత. దీంతో, ఆ శౌచాలయాన్ని స్నానపుగదిగా ఉపయోగించుకునేలా చేసింది. అందులో బట్టలు కూడా ఉతుక్కునే వీలుంటుందని చెబుతోంది.
సుదీక్ష ఈ ఘనత సాధించడంపై ఆమె తండ్రి సంజీవ్ ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఓ ప్రభుత్వ పాఠశాలలో సైన్సు టీచర్‌గా పనిచేస్తున్నారు. ఈ నమూనా ఇన్స్పైర్ పోటీల్లో టాప్‌గా నిలిచిందని జిల్లా సైన్స్ సూపర్వైజర్ సుధీర్ ఛందేల్ తెలిపారు. ఇది జాతీయ స్థాయికి ఎంపికైనట్లు గుర్తుచేశారు. అయితే.. మెట్రోపాలిటన్ నగరాల్లో ఇలాంటి స్మార్ట్ వాష్‌రూమ్‌ల అవసరం ఎక్కువగా ఉంటుందని ఠాకూర్ తెలిపింది.
ఇదీ చదవండి:నావికాదళ సైనికుడి దారుణ హత్య!