కర్ణాటకలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. అభంశుభం తెలియని వయసులో అతని తల్లి చనిపోయింది. ఈ విషయం తెలియని ఆ బాలుడు తన తల్లి బతికే ఉందనుకుని.. రెండు రోజులపాటు ఆమె మృతదేహంతోనే జీవనం సాగించాడు. తన తల్లి వంట చేయలేదని చెప్పి పక్కింటికి వెళ్లి తిని వచ్చేవాడు ఆ 11 ఏళ్ల బాలుడు. రెండు రోజుల తర్వాత తల్లి శరీరం నుంచి దుర్వాసన రావడం వల్ల ఆ బాలుడు ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. చిన్నారితో పాటు ఇంటికి వెళ్లిన వారు.. అసలు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అసలేం జరిగిందంటే..
బెంగళూరులోని గంగానగర్‌కు చెందిన అన్నమ్మ అనే 40 ఏళ్ల మహిళ తన 11 ఏళ్ల కుమారుడితో ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ తన కుమారుడిని పోషిస్తోంది. అన్నమ్మ ఫిబ్రవరి 25న ఎప్పటిలానే తన ఇంట్లో నిద్రించింది. ఆమె పక్కనే 11 ఏళ్ల కుమారుడు కూడా నిద్రించాడు. అయితే అన్నమ్మ అదే రోజు రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. ఇది తెలియని ఆ పసివాడు.. తన తల్లి ఇంకా నిద్రలేవలేదని భావించాడు. చావుపుట్టుక అంటే ఏంటో తెలియని ఆ బాలుడు.. ఆటలాడుకుంటూ రెండు రోజుల పాటు తల్లి మృతదేహంతోనే కాలం గడిపాడు. ఆకలి వేసినప్పుడు.. తన అమ్మ వంట చేయలేదని పక్కింటి వారితో చెప్పి.. భోజనం చేసి ఇంటికి వచ్చి తన తల్లి వద్దకు చేరేవాడు. ఆ తర్వాత మృతదేహం పక్కనే నిద్రించేవాడు.
అయితే ఫిబ్రవరి 28న తన తల్లి మృతదేహం నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి తెలియజేశాడు ఆ బాలుడు. వారు అన్నమ్మ ఇంటికి వచ్చి చూడగా.. అసలు విషయం బయటపడింది. ఆమె మృతి చెందినట్లు తేలింది. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవపరీక్షల నిమిత్తం అన్నమ్మ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అన్నమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
నాలుగు రోజులపాటు తల్లి మృతదేహం పక్కనే
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పదేళ్ల బాలుడు నాలుగు రోజుల పాటు తన తల్లి మృతదేహం పక్కనే కాలం గడిపాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. విద్యానగర్‌కు చెందిన రాజ్యలక్షి అనే మహిళ తన భర్తతో గొడవపడి.. తన 10 ఏళ్ల కుమారుడుతో కలిసి ఒంటరిగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 8న ఆమె మంచంపై నుంచి కిందపడి మృతి చెందింది. అయితే ఆమె నిద్రిస్తోందని భావించిన ఆ బాలుడు.. నాలుగు రోజులుగా మృతదేహంతోనే ఉండిపోయాడు. ప్రస్తుతం ఐదో జరగతి చదవుతున్న ఆ బాలుడు స్కూల్ నుంచి వచ్చి అల్పాహారం తిన్నాక తల్లి పక్కనే నిద్రించినట్లు తెలిపాడు.