Jammu Kashmir floods: జమ్ముకశ్మీర్లో అకస్మికంగా సంభవించిన వరదల వల్ల పర్యటక ప్రాంతమైన పహల్గామ్లో 11 మంది సందర్శకులు, ఇద్దరు టూరిస్ట్ గైడ్‌లు వరదల్లో చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఒకరు వరదల్లో కొట్టుకుపోయారని పేర్కొన్నారు. వీరు టార్సర్ మార్సర్ సరస్సు సమీప ప్రాంతాన్ని సందర్శిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టింది. టార్సర్ మార్సర్ అనేవి రెండు సరస్సులు. ఇవి త్రాల్, పహల్గామ్, శ్రీనగర్ పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. అమర్నాథ్ ఆలయం సమీపంలోనే పహల్గామ్ ఉంది. కొండను ఎక్కి ఈ ప్రాంతాన్ని చేరుకుంటారు.
వరదల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. ఈ అంతరాయం వల్ల వందలాది వాహనాలు రోడ్డు మీద నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. పూంచ్, రాజౌరి జిల్లాలను షోపియాన్ జిల్లాతో కలిపే మొఘల్ రహదారిపై కూడా కొండచరియలు విరిగిపడడం వల్ల రహదారిని మూసేశారు అధికారులు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
రోడ్డును మూసేయడం వల్ల హైవేపై చిక్కుకున్న ప్రయాణికులకు ఆహారం, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పలు చోట్ల రోడ్లుపై బురద, మట్టి పేరుకుపోవడం వల్ల రెస్క్యూ టీం వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి: మహిళపై సజీవ దహనానికి విఫలయత్నం.. నాలుక కోయాలని ప్రయత్నించి..