Most Polluted Places: దేశంలో కాలుష్య పరిస్థితులు ఏ మాత్రం మెరుగుపడట్లేదు సరికదా.. నానాటికీ మరింత దిగజారుతున్నాయి. ముఖ్యంగా దిల్లీ సహా ఉత్తర భారతంలో కాలుష్య స్థాయిలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35 భారత్‌లోనే ఉండటం గమనార్హం. ఈ మేరకు స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ విడుదల చేసిన ''ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2021'' వెల్లడించింది.
2021లో భారత్‌లోని ఏ నగరమూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలను చేరుకోలేకపోయిందని నివేదిక తెలిపింది. 48 శాతం నగరాల్లో అయితే డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు కంటే 10 రెట్లు కాలుష్యం ఉన్నట్లు పేర్కొంది. దిల్లీలో గతేడాదితో పోలిస్తే కాలుష్య స్థాయిలు 15 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే తొలి వంద కాలుష్య నగరాల్లో 63 భారత్‌లోనే ఉండటం గమనార్హం. అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో దిల్లీ తొలి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా రెండో స్థానంలో ఉంది.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో రాజస్థాన్ భీవాడి ప్రథమ స్థానంలో ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్ రెండు, దిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనివే కావడం గమనార్హం. చైనాలోని హోటన్ నగరం ఈ జాబితాలో మూడో స్థానంలో ఉండగా.. పాకిస్థాన్‌కు చెందిన ఫైసలాబాద్, బహవల్‌పూర్, పెషావర్, లాహోర్ కాలుష్య నగరాల జాబితాలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇవీ చూడండి: 'పెట్రో బాదుడుతో పేదలకు భారం.. కేంద్రానికి రూ.10వేల కోట్ల లాభం!'