100 CCTV Cameras In Tamil Nadu : ప్రస్తుత రోజుల్లో నేరస్థులను పట్టించడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా ముందుగా సీసీటీవీలనే పరిశీలిస్తున్నారు పోలీసులు. ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఉంటే దొంగతనాలు లాంటివి అరికట్టవచ్చని చెబుతున్నారు. దీంతో తమిళనాడులోని ఓ టౌన్ పంచాయతీలో ఏకంగా 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజల భద్రతను పెంపొందించే దిశగా అడుగులు వేశారు స్థానిక ప్రెసిడెంట్.
కోయంబత్తూర్ జిల్లా.. మెప్పెరిపాలయంలోని అన్ని వీధుల్లో 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించారు టౌన్ పంచాయతీ ప్రెసిడెంట్ శశికుమార్. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో సమగ్ర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందుకు ప్రభుత్వ నిధులతో పాటు పలువురు దాతలు ఇచ్చిన విరాళాలను ఉపయోగించారు. ఈ నిఘా వ్యవస్థను అధికారికంగా నవంబర్ 7వ తేదీన ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి కుమార్ సహా పలు ప్రముఖులు హాజరయ్యారు. "అన్ని గ్రామాల్లోనూ సీసీటీవీ వ్యవస్థ అవసరం. అలానే ప్రజలు కూడా తమ ఇళ్లలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవటం మంచిది ఇటువంటి చర్యలు చేపట్టం వల్ల నేరాలను తగ్గించువచ్చు." జిల్లా కలెక్టర్ క్రాంతి కుమార్ పేర్కొన్నారు.
మెప్పెరిపాలయం గ్రామంలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం వల్ల నేరాలు గణనీయంగా తగ్గుతాయని శశికుమార్ ధీమా వ్యక్తం చేశారు. నేరస్థులను గుర్తించటంలో సీసీటీవీ కెమెరాల సామర్థ్యాన్ని ప్రెసిడెంట్ ప్రశంసించారు. అదే రోజున సీసీటీవీ వ్యవస్థతోపాటు మరికొన్ని కార్యక్రమాలకు శశికుమార్ చేపట్టారు. రిజర్వాయర్‌లో నీటీమట్టాలను పర్యవేక్షించడానికి ఒక మొబైల్ యాప్‌ను, ఉచిత సేవా కేంద్రం, లైబ్రరీను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి, భద్రతకు తోడ్పాతాయని స్థానిక ప్రెసిడెంట్ తెలిపారు.
ఊరితో పాటు ఇళ్లల్లోనూ సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక చొరవ తీసుకుని సీసీటీవీ వ్యవస్థను ఏర్పాటు చేయించినందుకు టౌన్ పంచాయతీ ప్రెసిడెంట్ శశికుమార్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.