ఇలా అయితే కష్టమే.. వైసీపీ ప్రచార కార్యదర్శి గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు - వైసీపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
YSRCP State Campaign Committee Secretary Gopal Reddy : కర్నూలు జిల్లా ఆదోని వైసీపీలో అసమ్మతి సెగలు బయటపడ్డాయి. ఆదోని ఎమ్మెల్యేపై.. వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆడియో.. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ జెండా మోయనివారికి.. నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని గోపాల్ రెడ్డి ఆరోపించిన ఆడియో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే తీరుపై పలువురు నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.
ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జెండా మోయని వారికి ఎమ్మెల్యే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని ఆయన ఆడియోలో ఆరోపించారు. నామినేటెడ్ పదవుల ద్వారా వారు రాజకీయ, ఆర్థిక లబ్ది పొందుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వటం లేదని.. పార్టీ కోసం పని చేసిన వారు ప్రస్తుతం పార్టీలోనే లేరని అన్నారు. 2019 ఎన్నికల్లో ఆదోని మండలం గ్రామీణ ప్రాంతాల ప్రజల ఓటు వల్ల గెలుపొందిన ఎమ్మెలే.. గ్రామీణ నాయకులను మరిచి పదవులు వేరే వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. పని తీరు బట్టి పదవులు కేటాయించాలని.. కార్యకర్తల్లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని కోరారు. ఇలా చేయకపోతే వచ్చే ఎన్నికల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని.. ఎన్నికలలో విజయం సాధించటం కష్టమని మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది.