YSRCP Leaders ruckus on Excise Police: సెబ్ స్టేషన్లో వైసీపీ నాయకుడి వీరంగం..
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders ruckus on Excise Police : అనంతపురం నగరంలోని సెబ్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకులు హల్చల్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులనే అరెస్టు చేస్తారా? అంటూ అక్కడ వీరంగం సృష్టించారు. నగరంలో మద్యం తీసుకెళుతున్న యువకుడిని సెబ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న 32వ డివిజన్ కార్పొరేటర్ చంద్ర, అతని అనుచరులు సెబ్ స్టషన్కు వచ్చి ఎమ్మెల్యే అనుచరుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని ఎస్సై, సిబ్బందిపై దాడికి దిగారు.
నగరంలోని అంబేద్కర్ నగర్లో గుజ్జల సురేష్ అనే వ్యక్తి కర్ణాటక మద్యం తీసుకెళ్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 96 కర్ణాటక మద్యం బాటిళ్లను స్టేషన్కి తీసుకొని వెళ్లారు. యువకుడికి మద్దతుగా 32 వ డివిజన్ కార్పొరేటర్ సాకే చంద్ర అతని అనుచరులు సుమారు పదిమందితో స్టేషన్కు చేరుకున్నారు. ఎస్సై సీట్లో కూర్చునేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. తాము ఎక్కడైనా కూర్చుంటామంటూ కార్పొరేటర్ చంద్రతో పాటు అతని అనుచరులు పోలీసులపై దాడి చేసి వీరంగం సృష్టించారు. ఇంతలో ఎస్ఐ మునిస్వామి అక్కడికి చేరుకోగా ఆయనతో కూడా దురుసుగా ప్రవర్తించి దాడి చేశారు. ఎస్సై మునిస్వామి, కానిస్టేబుల్ శేఖర్, మహిళా కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేశారు. తాము ఎమ్మెల్యే అనుచరులంటూ తమనే ఎదిరిస్తారా అంటూ పోలీసులపై ధూషణకు దిగారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సెబ్ అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు.