YSRCP Councillors Protest: సమస్యల పరిష్కారం కోసం.. అధికార పార్టీ కౌన్సిలర్ల ఆందోళన
🎬 Watch Now: Feature Video
YSRCP Councilor Dharna : అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. రాయదుర్గం పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని నీటి సరఫరా సక్రమంగా చేయాలని సమావేశంలో అధికార వైసీపీకి చెందిన వార్డ్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధిక విద్యుత్ కోతలతో పాటు తాగునీరు ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ 23వ వార్డు మహిళ కౌన్సిలర్ పద్మజ తమ వార్డులో నీటి సమస్య పరిష్కరించాలంటూ కౌన్సిల్ సమావేశం హాలులో కింద బైఠాయించింది. సమస్య పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని నిరసన తెలిపింది. ఆమెతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా అధికారులను నిలదీశారు. 10, 15 రోజులైనా తమ వార్డులలో తాగునీరు సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. తాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని.. ఇందుకోసం చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని కొందరు కౌన్సిలర్లు తెలిపారు. పట్టణ ప్రజల నుంచి తాగునీటి సరఫరా విషయంలో తమను నిలదీయటమే కాక దూషణలు సైతం ఎదురవుతున్నాయని కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు సరఫరాకు చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి సమాధానమివ్వడంతో కౌన్సిలర్లు శాంతించారు.