రాష్ట్ర అభివృద్ధిలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలం - ప్రజా సమస్యలే ఎజెండాగా 15న 'ప్రజారక్షణ భేరి' : సీపీఎం - andhra pradesh important news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 13, 2023, 6:05 PM IST
YCP Government Completely Failed To Allocate Funds For Development: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్లు దారుణంగా ఉన్నా పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజా రక్షణ భేరి యాత్రలు నిర్వహించామన్నారు. తాము పర్యటించిన ఏ ప్రాంతంలోనైనా ప్రజలు మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదన్నారు. అధికార పార్టీ మాత్రం రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సమస్యలే ఎజెండాగా ఈ నెల 15న విజయవాడలో ప్రజా రక్షణ భేరి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివస్తారని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ భారాలతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీరు, రోడ్లు, విద్యా, వైద్యం అందించడంలో జగన్ సర్కారు తీవ్రంగా విఫలమయ్యిందన్నారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్ని మోదీ ప్రభుత్వానికి ఒంగి పని చేస్తున్నాయని విమర్శించారు. దేశాన్ని అన్ని రంగాల్లో నాశనం చేస్తున్న బీజేపీతో జనసేన తెలంగాణలో పొత్తుపెట్టుకోవడం అన్యాయమన్నారు.