మంత్రి బుగ్గన వింత సలహా - అభివృద్ది పనులకు గుత్తేదారులను తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే!
🎬 Watch Now: Feature Video
YCP General Meeting in Zilla Parishad in Kurnool: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తుతున్న వేళ.. తమ ప్రాంతంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాల్సిన ప్రజాప్రతినిధులు సర్వసభ్య సమావేశానికి డుమ్మా కొట్టారు. కర్నూలులో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అధికార పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు పాల్గొనాల్సి ఉండగా.. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. కనీసం మంత్రి గుమ్మనూరు సైతం హాజరు కాలేదు.
బిల్లులు చెల్లించకపోవటం వల్ల పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావటం లేదని సర్వసభ్య సమావేశానికి హజరైన నేతలు బుగ్గన ఎదుట వాపోయారు. నేతల ఆందోళనతో ఏ సమాధానం చెప్పాలో అర్ధం కాని పరిస్థితిలో.. గుత్తేదారులను తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదేనంటూ మంత్రి బుగ్గన ఉచిత సలహా ఇచ్చారు. వారితో పని చేయించే బాధ్యత మీపైనే ఉంటుందని గుర్తు చేశారు. అభివృద్ది పనులు జరగకపోవడంతో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింకీ వెళ్లలేకపోతున్నామని.. ప్రజలు నిలదీస్తుంటే ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని.. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధీ జరగటం లేదని వైసీపీ సభ్యులు గోడు వెళ్లబోసుకున్నారు.