తాగునీటి సమస్య తీర్చాలంటూ మున్సిపల్ ఆఫీసుకు తాళం - అధికారులు దళిత ద్రోహులుగా మారారంటూ ఆగ్రహం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 22, 2023, 9:13 PM IST
Women Protest in Madakasira Municipal Office : తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపల్ కార్యాలయం గేటును మహిళలు మూసేశారు. మడకశిర పట్టణంలో దళితులు ఉంటున్నా 17వ వార్డు ఇందిరమ్మ కాలనీలో ఎన్నో ఏళ్లుగా నీటి సమస్యతోపాటు.. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు మహిళలు బైఠాయించారు. వందలాది దళిత కుటుంబాలు నివసిస్తున్న తమ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు విఫలం అయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులందరు దళిత ద్రోహులుగా మారారంటూ మున్సిపల్ ఆఫీస్ ముందు ఖాళీ బిందెలతో మహిళలు నిరసనకు దిగారు. చేతకాని ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్లు మాకోద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి.. మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యాలయం వద్దకు చేరుకున్న మున్సిపల్ అధికారులు సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.