Volunteers argue with Sarpanch: రెచ్చిపోయిన వైసీపీ నాయకులు, వాలంటీర్లు.. మహిళా సర్పంచ్‌తో వాగ్వాదం - విశ్వేశ్వరాయపురంలో జగనన్న సురక్ష కార్యక్రమం
🎬 Watch Now: Feature Video
YSRCP Leaders and Volunteers Fight with Woman Sarpanch in Visweswarayapuram: జగనన్న సురక్ష కార్యక్రమంలో ఓ మహిళా సర్పంచ్‌పై గ్రామ వాలంటీర్ వాగ్వాదానికి దిగారు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో సర్పంచ్ చెల్లుబోయిన హెలీనా అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన మహిళ సర్పంచ్.. కొంత మంది వాలంటీర్ల కారణంగా అర్హత కలిగిన కొంతమందికి సంక్షేమ పథకాలు అందటం లేదని ఆరోపించారు. ఈ క్రమంలో వాలంటీర్ మున్నా సభావేదిక వైపు దూసుకొచ్చి పథకాలు ఎవరికి అందలేదో చెప్పాలంటూ సర్పంచ్‌తో వాగ్వాదానికి దిగారు. అతనితో పాటు మిగతా వాలంటీర్లు, వైఎస్సార్సీపీ నాయకులు తోడవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కావాలనే టీడీపీ సానుభూతిపరులకు పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంతో పంచాయతీకి సంబంధం ఏంటని ఓ వైసీపీ నాయకుడు ప్రశ్నించారు. సచివాలయం పంచాయతీ పరిధిలోకే వస్తుందని సర్పంచ్ సమాధానం ఇచ్చారు. దీనిపై కొంతమంది వాలంటీర్లపై గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశానని సర్పంచ్ చెప్పారు. దీంతో కొంతసేపు సభ రసాభాసగా మారింది. ఈ నేపథ్యంలో ధ్రువపత్రాలు పంపిణీ ప్రారంభించేందుకు సర్పంచి అంగీకరించలేదు. పంచాయతీ కార్యదర్శి కలుగజేసుకుని సర్దుబాటు చేయడంతో కార్యక్రమం కొనసాగింది.