volunteer Haribabu murder case: వివాహితను రెండేళ్లుగా వేధిస్తున్న వాలంటీర్ హత్య.. లొంగిపోయిన నిందితులు
🎬 Watch Now: Feature Video
volunteer Haribabu murder case : కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు వార్డు వాలంటీరు హరిబాబు హత్య కేసును ఛేదించారు. ఓ వివాహితను వేధించడమే హత్యకు కారణమని తేలింది. స్థానిక రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి కేసు వివరాలు వెల్లడించారు. మండిగిరి పంచాయతీ పరిధిలోని భరత్‌నగర్‌లో వార్డు వాలంటీరుగా పని చేస్తున్న హరిబాబు పట్టణ శివారులోని రాజీవ్‌గాంధినగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ వివాహితను రెండేళ్లుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలోనూ పంచాయతీ జరిగింది. గత నెల వినాయక చవితి రోజున హరిబాబు మళ్లీ ఆ వివాహితను వేధించాడు. దీంతో వివాహిత భర్త ఎం.భీమన్న ఎలాగైనా హరిబాబును హత్య చేయాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో ఓ సారి కర్రతో బాది చంపాలని అనుకుని విఫలమయ్యాడు. గత నెల 20వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత హరిబాబు తన ఇంటి ముందు పడుకొని ఉండగా.. ఇదే అదునుగా భావించి అతడిని భీమన్న మాయమాటలు చెప్పి ముళ్లకంపల వైపు తీసుకెళ్లాడు. అప్పటికే దాచి ఉంచిన గొడ్డలితో హరిబాబును నడికాడు. హరిబాబు చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గొడ్డలిని ముళ్లపొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయారు. నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు, ఫోన్ కాల్స్ తదితర ఆధారాలతో నిందితులను గుర్తించామన్నారు. నిందితులు భీమన్న, ఈరన్న ఇద్దరూ మండిగిరి వీఆర్‌వో రాజశేఖర్ వద్ద లొంగిపోగా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలి, కాల్చివేసిన దుస్తులను సీజ్ చేశామన్నారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన సిబ్బందిని డీఎస్పీ శివ నారాయణ స్వామి అభినందించారు.