ఈ వృద్ధురాలికి సాయం చేసేదెవరు? - విశాఖ అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి ఎదురుచూపులు - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 12:19 PM IST
Visakha Fishing Harbour Fire Accident Victim: విశాఖలోని ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటన వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. గంగను నమ్ముకుని వేటకు వెళ్లే మత్స్యకారుడు మొదలు.. బోటు యజమాని, బోటులో పనిచేసే కార్మికులు, వలలో పడ్డ చేపల్ని ఒడ్డున అమ్ముకునే మహిళలు, చేపల్ని విదేశాలకు, ఇతర ప్రాంతాలకు తరలించే ఎక్స్పోర్టర్స్.. ఇలా చాలా మంది కుటుంబాలపై దీని ప్రభావం పడింది. అందులో ఒక వృద్ధురాలు.. పండు ముసలి వయస్సులో ఒకరిపై ఆధారపడకుండా విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఓ మూలన... చేపలు కొనుగోలు చేసే వారికి కవర్లు, చిన్న చిన్న చేపలు అమ్ముకుంటూ రోజుకు 200 రూపాయలు సంపాదిస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది.
Vizag Harbour Fire Incident: ఆదివారం అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్ జీరో జెట్టిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ వృద్ధురాలి దుకాణం పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. రోజులానే కవర్లు అమ్ముకునేందుకు ఉదయాన్నే హార్బర్కి వచ్చిన వృద్ధురాలు.. కాలిపోయి బూడిదైపోయిన తన దుకాణాన్ని చూసి కన్నీటిపర్యంతమైంది. జరిగిన విషయాన్ని తన కూతురు ద్వారా తెలుసుకుని నిస్సహాయ స్థితిలో కాలిపోయిన దుకాణం వద్ద కూర్చుని.. ఎవరైనా తనకు భరోసా ఇస్తారేమోనని వృద్ధురాలు ఎదురుచూసింది.
Compensation to Vizag Fire Accident: ప్రభుత్వం, మంత్రి సిదిరి అప్పలరాజు కేవలం అగ్ని ప్రమాదంలో కాలిపోయిన బోట్లకు మాత్రమే పరిహారం ఇస్తుందని ప్రకటించడంతో సాయం కోసం ఎదురుచూస్తోంది. ప్రతిరోజు తాను కవర్లు, చిన్న చిన్న చేపలు అమ్ముకోగా వచ్చిన కొంత డబ్బులు సైతం ఈ దుకాణంలో పెట్టి వెళ్లిపోయానని.. మొత్తం బుగ్గిపాలయ్యిందని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు వచ్చి తనకు సాయం చేస్తారని ఆశగా ఎదురుచూస్తోందీ వృద్ధురాలు.