Protect Temple Lands In Dachepalli: దేవాలయ భూముల్ని కాపాడాలంటూ ఆందోళన - హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దు
🎬 Watch Now: Feature Video
Villagers Protesting To Protect Nagendraswamy Temple Lands In Dachepalli : పల్నాడు జిల్లా దాచేపల్లి నాగేంద్రస్వామి దేవాలయ భూమికి సంబంధించిన భూముల్ని కాపాడాలంటూ గ్రామస్థులు, భక్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 'ఆలయానికి దాతలు ఇచ్చిన భూములను అమ్మవద్దు.. హిందువుల మనోభావాలు దెబ్బతీయవద్దు.. దేవాలయ భూములను కాపాడండి..హైందవ ధర్మాన్ని కాపాడండి..' అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. దాచేపల్లి శివారులో ఉన్న నాగేంద్రస్వామి ఆలయానికి చెందిన భూమిని ఎల్లంపేటకు చెందిన ఆరుగురు వ్యక్తులకు 5 సెంట్ల చొప్పున కేటాయించారని గ్రామస్థులు ఆరోపించారు. ఆ భూముల్ని వెంటనే దేవాదాయశాఖకు అప్పగించాలని భక్తులు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా దేవాదాయశాఖ కింద ఉన్న భూముల్ని ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టొద్దని కోరారు. వందల సంవత్సరాల నుంచి దేవాదాయ శాఖ కింద ఉన్న భూమి ఆ రోజుల్లో దాతలు స్వామివారికి నైవేద్యం తీర్థ ప్రసాదాల నిమిత్తం ఇచ్చి ఉన్నారని.. భక్తుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా కార్యక్రమాలు చేయవద్దని వారు వేడుకుంటున్నారు. ఇలా ఎండోమెంట్ భూమంతా ఇచ్చుకుంటూ పోతే దేవాలయాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని గ్రామస్థులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.