Muthyapu Pandiri Vahanam: ముత్యాల పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు - తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 17, 2023, 10:27 PM IST
Muthyapu Pandiri Vahanam: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామివారు మూడో రోజు రాత్రి ముత్యాల పందిరి వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ముత్యాల ఆభరణాలతో అలంకృతుడైన బకాసురవధ రూపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా తిరువీధుల్లో విహరించారు. చల్లని ముత్యాల కింద నిలిచి స్వామి వారు భక్తులను కటాక్షించారు. భక్తులల్లో తాపత్రయాలను పోగొట్టి, చల్లదనాన్ని ప్రసాదించారు. వాహన సేవలో పాల్గొన్న గజరాజులు, అశ్వాలు, వృషభాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కళాకారుల కోలాటాలు, అన్నమయ్య సంకీర్తనలకు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భజన బృందాలు వాహన సేవలో ఆడిపాడాయి. స్వామివారి దివ్యరూపాన్ని కనులారా దర్శించుకున్న భక్తులు...నాలుగు మాడ వీధులు గోవింద నామస్మరణలతో మారు మోగింది. భక్తులు స్వామి వారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. వాహన సేవలో పాల్గొనడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. అధికారులు ముందస్తు ఏర్పాట్లతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నారు. స్వామి వారి ముత్యాల పందిరి వాహన సేవలో పాల్గొనడం తమకు సంతోషంగా ఉందని భక్తులు పేర్కొన్నారు.