YCP Leader Madhusudhan: విశ్వేశ్వరరెడ్డి భూ అక్రమాలపై మాట్లాడినందునే సస్పెండ్: మధుసూదన్ - మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
🎬 Watch Now: Feature Video
YCP Leader Madhusudhan Reddy Comments: తన సోదరుడి భూ అక్రమాలపై మాట్లాడినందునే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వరరెడ్డి సోదరుడు మధుసూదన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన సోదరుడు విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు ప్రణయ్‌రెడ్డి అక్రమాలు, భూ దందాల గురించి వైఎస్సార్సీపీ అధిష్ఠానంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఓ మహిళకు చెందిన భూమిని కబ్జా చేయటానికి ఫోర్జరీ సంతకాలు చేశారని, పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైనా పార్టీ విచారణ చేసి చర్యలు తీసుకోకపోవటం బాధాకరమన్నారు. జగన్ మోహన్‌రెడ్డి పార్టీ పెట్టక ముందు నుంచే తాను ఆయనతో ఉన్నానని, తన సస్పెన్షన్ గురించి ఆయనకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని మధుసూదన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ నిబంధనలకు తాను ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని, ఉరవకొండలో పార్టీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న తీరుపై మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న తనను సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి లేదని, ఇది అధిష్ఠానం తీసుకోవాల్సిన నిర్ణయమని మధునూదన్ రెడ్డి స్పష్టం చేశారు.