Dalit Communities protest: విశాఖ అంబేడ్కర్ భవన్లో దళితుల నిరసన.. వారిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్.. - దళిత సంఘాల ఐక్యవేదిక ఆందోళన వీడియో
🎬 Watch Now: Feature Video
Dalit Communities protest: రైల్వే వైద్యుడు డాక్టర్ విజయ్‌కుమార్ ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. విశాఖలోని అంబేడ్కర్ భవన్లో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు.. జరిగిన ఘఠనపై మండిపడ్డారు. వాల్తేరు రైల్వే డివిజన్ ఆసుపత్రిలో దళిత డాక్టర్, నర్సులపై ఆధిపత్య కుల సీనియర్ వైద్యుల లైంగిక వేధింపులపై నిష్పాక్షిక అంతర్గత దర్యాప్తు నిర్వహించాలని ఆయన కోరారు. బాధితులైన ఎస్సీ ఉద్యోగులపై కక్ష సాధింపు మూకుమ్మడి బదిలీలు నిలిపివేయాలని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు విశాఖ రైల్వే ఆసుపత్రిలో కులతత్వం, రౌడీయిజం రాజ్యమేలుతున్నాయని వెంకట్రావు ఆరోపించారు. దళితుడైన డాక్టర్ విజయ్‌కుమార్ నైపుణ్యం, అంకితభావంతో పనిచేసేవారని ఆయన తెలిపారు. ఇలా అందరి మన్ననలను పొందుతూ.. వృత్తి పరంగా రాణించటం జీర్ణించుకోలేని సీనియర్ డాక్టర్స్ కాశీపతి, మహేష్ కుమార్, లక్ష్మణరావులు మరో ముగ్గురు ఉద్యోగుల సహాయంతో గత నెలలో విజయ్‌కుమార్ ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని వెంకట్రావు వివరించారు. తక్షణమే రైల్వే బోర్డు ఈ అంశంపై విచారణ జరిపించి, సాక్షులను బెదిరిస్తున్న కాశీపతిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మూకుమ్మడిగా బదిలీ చేసిన ఆరుగురు ఎస్సీ ఉద్యోగులను తిరిగి యధా స్థానంలో కొనసాగించాలని వివిధ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.