Two dead many others were injured: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి పలువురికి గాయాలు... - తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2023, 7:49 PM IST
Two dead many others were injured: ఇంట్లో వంట చేసే సమయంలో చూపిన చిన్న నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్న ఘటన కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో చోటుచేసుకుంది. అగ్నిప్రమాదంలో శ్రావణి అనే 14 ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందగా... 25 ఏళ్ల చిన్నబాబు అనే యువకుడు కాకినాడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు ఇంట్లో గ్యాస్ లీకైంది. అది గమనించకుండా కుటుంబసభ్యులు మధ్యాహ్నం వంట చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఒక్కసారిగా పెలిపోవడంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల శ్రావణి అనే బాలిక పూర్తిగా మంటల్లో కాలిపోయింది. చిన్న బాబు అనే యువకుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్న బాబు చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై అగ్నిమాపక, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకాధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.