Tribals Four KMs Doliyatra for Roads: 'పలకరా అన్నలూ..ఎన్నాళ్లీ డోలీ మోతలు'.. వినూత్నంగా గిరిజనుల నిరసన - Tribals protest
🎬 Watch Now: Feature Video
Tribals Four KM Doliyatra for Roads: అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం అనకాపల్లి జిల్లాను అనుకొని ఉన్న కొన్ని కొండ ప్రాంతాల్లో రహదారులు వేయాలని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులు వినూత్న పద్ధతిలో నిరసన చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు నాలుగు కిలోమీటర్ల మేర డోలీ యాత్ర చేపట్టారు. తమ గ్రామాలకు రోడ్లు వేయాలని, నీలబంధకు విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించాలంటూ కొండపై ర్యాలీ చేస్తూ ఆందోళనకు దిగారు.
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం నీలబంధలో డోలీ యాత్ర ప్రారంభించి పిత్రుగెడ్డ, పెద్దగరువు గ్రామాల మీదుగా జాజులబంద వద్ద ముగించారు. అర్ల నుంచి పెద్దగరువు, పిత్రుగెడ్డ, జాజులబంద వంటి కొండ శిఖర గ్రామాలకు తక్షణమే రోడ్లు వేయాలని వారంతా డిమాండ్ చేశారు. ఆయా ప్రాంతాల్లో ఎస్‌టీ కోందు తెగకు చెందిన సుమారు 300 మంది కొండపైనే జీవనం సాగిస్తున్నారు. 2020లో ఒక్కో ఇంటికి 10వేల రూపాయల చొప్పున చందాలు పోగు చేసుకుని 7లక్షల రూపాయల సొంత ఖర్చుతో ఆదివాసీలే రోడ్డు నిర్మించుకున్నారు. అయితే వర్షాకాలం నేపథ్యంలో ఆ రోడ్డు కాస్త కొట్టుకుపోయింది. అదేవిధంగా జ్వరాల బారిన పడితే కి.మీ మేర రోగుల్ని డోలీల్లో మోసుకుంటూ ఆస్పత్రులకు తీసుకు వెళ్లాల్సి వస్తోంది. కుంబర్ల గ్రామానికి చెందిన పాంగి రోజా అనే మహిళ అత్యవసర వేళ సరైన సౌకర్యాలు లేకపోవడంతో అడవితల్లి ఒడిలోనే కన్నుమూసింది. ఈ విధంగా అనేక మంది మార్గమధ్యంలోనే మృతి చెందుతున్న పరిస్థితులున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భారీ సంఖ్యలో గిరిజనులు చేరుకుని 'పలకరా అన్నలూ..ఎన్నాళ్లీ డోలీ మోతలు' అని నినాదాలు చేసుకుంటూ డోలీయాత్ర నిర్వహించారు.