Elephants Died in Road Accident: రోడ్డు ప్రమాదంలో ఏనుగులు మృతి.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? - రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు దుర్మరణం
🎬 Watch Now: Feature Video
Three elephants died in road accident : చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి చెందాయి. మూడు రాష్ట్రాల సరిహద్దుల ఉన్న ఈ ప్రాంతంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఏనుగుల గుంపుతో పంటపొలాలు, తోటలు ధ్వంసం అవుతున్నాయని.. రైతులు అనేకసార్లు అటవీశాఖ దృష్టికి తీసుకెళ్లినా.. ప్రయోజనం లేదు. ఇటీవల కాలంలో పంటలను రక్షించుకునేందుకు.. రైతులు విద్యుత్ కంచె వేసిన సందర్భాల్లో.. ఏనుగులు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా, బుధవారం రాత్రి పది గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపును ఐచర్ వాహనం ఢీ కొట్టిన ఘటనలో మూడు ఏనుగులు మృతి చెందడం, జంతు ప్రేమికులను కలవరపెడుతోంది.
పలమనేరులో ఏనుగులు మృతి చెందడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఏనుగులు రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో అతి వేగంగా ఐచర్ వాహనం ఢీ కొంది. పలమనేరు, కర్ణాటక సరిహద్దుల నుంచి టమోటాలను తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి తరలించే వాహనాలు చాలా వేగంగా ప్రయాణిస్తుంటాయి. వీరు తెల్లవారే సమయానికి టమోటా లోడును అక్కడి మార్కెట్కు తరలించాలనే లక్ష్యంతో వేగంగా వాహనాలను నడుపుతుంటారు. ఈ వేగమే ఏనుగుల ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఐచర్ వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఘటన స్థలంలోనే మూడు ఏనుగులు చనిపోవడాన్ని చూస్తే, అత్యతం వేగంతోనే వాహనం ఏనుగులను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. వాహనం ఢీకొన్న వేగానికి అత్యంత బలమైన ఏనుగులు రోడ్డు పక్కన ఉన్న రైలింగు రాడ్డును ఢీకొని కింద పడ్డాయి. ఒక రాడ్డు ఏనుగు శరీరంలోకి దూసుకుపోయింది. ఏనుగుల కోసం చేపట్టిన కంచె నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఏనుగులు ప్రాణాలను పొగొట్టుకోవాల్సి వస్తోందని స్థానికులు భావిస్తున్నారు. చనిపోయిన ఏనుగులకు పోస్టుమార్టం చేసి ఖననం చేసేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.