Yuvagalam Padayatra: 'చేనేతలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తాం' - కర్నూలు జిల్లా రాజకీయ వార్తలు
🎬 Watch Now: Feature Video
TDP National General Secretary Nara Lokesh: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించిన 'యువగళం' పాదయాత్ర ఈరోజుతో 86వ రోజుకు చేరుకుంది. ఈ 86వ రోజు పాదయాత్రను ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు క్యాంప్ సైట్ నుంచి ఉత్సాహంగా ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి పార్టీ కార్యకర్తలు, స్థానికులు, యువత నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం లోకేశ్.. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ సందర్భంగా రాళ్లదొడ్డిలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన లోకేశ్.. చేనేతల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులను ఆదుకునే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. చేనేతలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని లోకేశ్ హామీ ఇచ్చారు.
''నేను ఓపెన్‌గా చెప్తున్నా.. మీ సమస్యలు నాకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో చేనేత కార్మికుల సమస్యలను పూర్తిగా తెలుసుకున్నాను. అదే సమయంలో జీఎస్టీ విషయం కూడా బయటపడింది. నేను చేనేత కార్మికులను దత్తత తీసుకున్నా.. మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.'' అని రాళ్లదొడ్డిలో చేనేత కార్మికులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఈ 86వ రోజు పాదయాత్రతో 'యువగళం' పాదయాత్ర 11 వందల కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంటుంది. ఈ సందర్భంగా గోనెగండ్లలో నారా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు.