TDP Nakka Anand Babu on New Sand Policy: 'తెరముందు దిల్లీ కంపెనీ.. వెనుక తమ్ముడు చక్రం తిప్పేలా జగన్ కొత్త ఇసుక పాలసీ'
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 19, 2023, 3:00 PM IST
|Updated : Oct 19, 2023, 3:09 PM IST
TDP Nakka Anand Babu on New Sand Policy: అధికారాంతంలో జగన్ రెడ్డి రెట్టింపు ఇసుక దోపిడీకి సిద్ధమయ్యాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. జేపీ సంస్థ మాదిరే.. ఇప్పుడు దిల్లీ కంపెనీని తెరముందు పెట్టి.. వెనుక తన తమ్ముడు అనిల్ రెడ్డి చక్రం తిప్పేలా జగన్ కొత్త ఇసుక పాలసీకి రూపకల్పన చేశాడని మండిపడ్డారు. గతంలో ఉన్న జేపీ సంస్థ, వైసీపీ నేతలు, తాడేపల్లి ప్యాలెస్ లాంటి మూడంచెల వ్యవస్థను కాదని.. ఇప్పుడు సింగిల్ విండో పాలసీని తీసుకొచ్చాడని దుయ్యబటారు.
సింగిల్ విండో విధానంతో నేరుగా తాడేపల్లికే మొత్తం దోపిడీ సొమ్ము జమ అయ్యేలా కార్యాచరణ రూపొందించాడని ధ్వజమెత్తారు. ఇసుకాసురుడు జగన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త సింగిల్ విండో పాలసీ రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి అమల్లోకి రానుందన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ స్టే ఉన్నా.. ఎన్జీటీ ఆదేశాలను సుప్రీం సమర్థించినా.. జగన్ రెడ్డి మాత్రం గుట్టుగా ఇసుక తవ్వకాల టెండర్లు పిలిచేశాడని విమర్శించారు. తన సహజవనరుల దోపిడీకి బ్రేక్ పడితే, ఖజానా నిండుకుంటుందన్న ఆలోచనతో జేపీ సంస్థ కాంట్రాక్ట్ ముగిసినా ఇప్పటికీ ఇసుక దోపిడీ సాగిస్తూనే ఉన్నాడని ఆనంద్‌బాబు ఆరోపించారు.