'బటన్ నొక్కి పంచడం కంటే జగన్‌రెడ్డి కొట్టేస్తున్నదే ఎక్కువ'
🎬 Watch Now: Feature Video
TDP Leader Vijay Kumar: బటన్ నొక్కుడు పేరుతో ప్రజలకు ఇస్తున్నదానికంటే ఇతర మార్గాల్లో జగన్ రెడ్డి కొట్టేస్తున్నదే ఎక్కువని తెలుగుదేశం అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తానన్న జగన్ రెడ్డి మద్యం తయారీ నుంచి అమ్మకం వరకు వివిధ దశల్లో దశలవారీగా పేదల సొమ్ము దోచేస్తున్నాడని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం రోజుకు కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రజల నుంచి రాబడుతుందన్నారు. రాష్ట్ర ఖజానాకు ఐదు సంవత్సరాల్లో 99వేలకోట్ల రూపాయల ఆదాయం సమకూరితే, కేవలం మద్యం అమ్మకాల ద్వారా 25వేలకోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని అన్నారు.
ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకోవడం జగన్‌కు బాగా తెలుసని ఎన్. విజయ్ మండిపడ్డారు. మద్యం ధరలు పెంచింది, వినియోగం తగ్గించడానికని చెబుతున్నారని, మద్యం వినియోగం ధరలు పెంచి ఎంత మొత్తంలో తగ్గించారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఎంత ఇస్తున్నారో అందులో సగం కేవలం మద్యం ద్వారానే లాగేస్తున్నారన్నారు.
మద్యం విక్రయాల్లో డిజిటల్ చెల్లింపులు ఎందుకు ఉండవని విజయ్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిజిటల్ చెల్లింపులు ఎందుకు ఉండడం లేదో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీలన్నీ వైఎస్సార్సీపీ వద్దే ఉన్నాయని, కొత్త డిస్టిలరీలకు అనుమతివ్వలేదంటున్నారన్నారు. లీజు, సబ్‌లీజు అన్నీ వైఎస్సార్సీపీ నేతల వద్దే ఉన్నాయని ఆరోపించారు. వారు చెప్పిన బ్రాండ్లు మాత్రమే మద్యం దుకాణాల్లో దొరుకుతాయని విమర్శించారు.