LED street lights: బకాయిలు చెల్లించని ప్రభుత్వం.. అటకెక్కిన ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్ట్
🎬 Watch Now: Feature Video
LED street light project: జగన్ ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్రంలో ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్ట్ అటకెక్కిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్ట్‌ను జగన్ అటకెక్కించారని ఆయన ఆరోపించారు. వీధి దీపాలు ఏర్పాటు చేసిన సంస్థకు 4 ఏళ్లుగా బకాయిలు చెల్లించకపోవడంతో నోటీసులు పంపించిందని.. ప్రాజెక్ట్ నిర్వహణ నుంచి తప్పుకుంటామని హెచ్చరించిందని పట్టాభి తెలిపారు.
నారా లోకేశ్ పంచాయతీరాజ్ శాఖమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డుస్థాయిలో సుమారు 24లక్షల ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేశారని పట్టాభిరామ్ గుర్తు చేశారు. ఎల్ఈడీ వీధి దీపాలు అమర్చిన కేంద్ర సంస్థ ఈఈఎస్ఎల్కు రూ.651.55 కోట్లు ఎగనామం పెట్టి.. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ తమకు రావాల్సిన బకాయిల కోసం పోరాడుతూనే ఉందని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం ఎంతకీ తమ బకాయిలు చెల్లించకపోవడంతో చివరకు గత్యంతరం లేక వైసీపీ సర్కార్కు ఈ.ఈ.ఎస్.ఎల్ సంస్థ లీగల్ నోటీసులు పంపించిందని తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రంలో వీధిదీపాలు వెలగకపోతే దానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే అని పట్టాభిరామ్ విమర్శించారు.