Vallabhaneni Vamsi Irregularities : ఆయన వైఎస్సార్సీపీ నాయకుడి వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కానీ తన పేరుమీద గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు గ్రామం పరిధిలో మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. కొండపావులూరులో ఇష్టానుసారం తవ్వకాలు నిర్వహించారు. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేశారు. ప్రస్తుతం ఆ కారు డ్రైవర్‌పై కేసు నమోదైంది.
గత గన్నవరం ఎమ్మెల్యే అనధికార పీఏ వద్ద జీతం ఉన్న వ్యక్తి పేరుమీద బాపులపాడు మండలంలో రెండు ఎకరాల్లో మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. వాస్తవానికి ఆ వ్యక్తికి మట్టి తవ్వకం గురించే తెలియదు. కానీ ఆయన అధిక మొత్తంలో తవ్వకాలు చేసినందుకు విజిలెన్స్ విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణలో తను ఇంటి స్థలం కోసం ఆధార్ కార్డు ఇచ్చినట్లు చెప్పారు. సంతకాలు చేయమంటే చేశానని తెలిపారు. ఎవరు చేయమన్నారో పేరు కూడా తెలియజేశారు.
బాపులపాడు మండలం రంగన్నగూడెం, రేమల్లె గ్రామాల్లోని రైతుల పొలాల్లో ఇష్టానుసారం మట్టి తవ్వకాలు జరిపారు. ఒక్క రూపాయి కూడా సీనరేజి చెల్లించలేదు. దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు అనుమతులు రాకముందే తవ్వకాలు జరపడంతో ప్రస్తుతం అన్నదాతలకు నోటీసులు ఇచ్చారు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎవరికి లీజుకు ఇచ్చారో రైతులు వెల్లడించారు. అంతే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది.
ఇసుక తవ్వకాల్లో నాడు నేడు ఆయనదే - యథేచ్ఛగా హైదరాబాద్‌కు అక్రమ రవాణా
Vallabhaneni Illegal Sand Mining : ఇలాంటి తవ్వకాలు ఆయా గ్రామాల్లో, పోలవరం కట్టలపైనా ఉన్నాయి. వీటిపై విజిలెన్స్ విచారణ దాదాపు కొలిక్కి వచ్చింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన ప్రధాన అనుచరులపై నివేదిక సిద్ధమైంది. ఇప్పటికే పలు పోలీసు కేసులు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీపై అక్రమ తవ్వకాల కేసు నమోదు కానుంది. విజిలెన్స్ విచారణ గత నాలుగు నెలలుగా జరుగుతోంది. విచారణ దాదాపు పూర్తికావొచ్చింది.
ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ప్రధానంగా గన్నవరంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిసింది. రూ.వందల కోట్ల సీనరేజి చెల్లించాల్సి ఉందని విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. అధికారిక మైనింగ్‌తో పాటు అనధికారిక తవ్వకాలకు సంబంధించి ప్రతి గుంటను అధికారులు కొలతలు తీశారు. ఎంత మట్టి వస్తుందో దానికి 10 రెట్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అధికారిక వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం సీనరేజి చెల్లించని మట్టి విలువ రూ.100 కోట్లు ఉన్నట్లు తేలింది. దీనికి పది రెట్లు అంటే రూ.1000 కోట్లు జరిమానాలు విధించనున్నారు. క్రిమినల్ కేసులు సరేసరి. మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు ప్రధాన అనుచరుల పేర్లు విజిలెన్స్ జాబితాలో ఉన్నట్లు తెలిసింది.
గోరంత అనుమతులతో : మైలవరం, గన్నవరం నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ సర్కార్‌లో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ సాగించిన విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల పాటు కొండలు, గుట్టలు, బంజరులు, పోలవరం కట్టలు కొల్లగొట్టారు. అప్పటి ముఖ్య నాయకులు నాడు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వారు ఈ అరాచకాలకు పాల్పడిన విషయం తెలిసిందే. గోరంత అనుమతులు తీసుకుని కొండలన్నీ పిండి చేశారు. ఈ పాపం అమాయకులకు చుట్టుకుంటోంది. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో గన్నవరం నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే కలిసి బినామీల పేరుతో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. నియోజకవర్గంలోని మేతపోరంబోకు భూముల్లో తవ్వకాలకు ఎన్ఓసీ జారీ చేశారు.
కూలీలు, డ్రైవర్ల పేరిట దరఖాస్తులు : ప్రజాప్రతినిధి ఒత్తిడితో పోలవరం కట్టలకు అనుమతులు ఇచ్చారు. అవి కూడా 100 మీటర్ల చొప్పున 50,000ల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వే విధంగా అనుమతులు ఇచ్చారు. ఇందులో భాగంగా తమ వద్ద దినసరి కూలీలుగా, డ్రైవర్లుగా, ఇతర పనులు చేసే వారి పేర్లపై తీసుకున్నారు. వారి ఆధార్ కార్డులు సమర్పించారు. బాపులపాడు మండలం, రంగన్నగూడెం గన్నవరం మండలంలోని వెదురు పావులూరు, పాతపాడు, గొలన్‌పల్లి, కొండపావులూరు, బీబీగూడెం, పురుషోత్తం పట్నం, ముస్తాబాద్, పోలవరం కట్టలను విజిలెన్స్ బృందం పరిశీలించింది. చాలా మందికి తెలియకుండానే అనుమతుల కోసం దరఖాస్తులు చేశారు. ప్రస్తుతం విజిలెన్స్ విచారణలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుల పేర్లు బయటకు వచ్చినట్లు తెలిసింది.
గన్నవరంలో నాటి ఎమ్మెల్యే ఇష్టానుసారం తవ్వకాలు జరిపారని శాసనసభలో మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దీనిపై విచారణ జరుగుతోందని, చర్యలు తప్పక ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ కేసును సీఐడీకి అప్పగించనున్నట్లు తెలిసింది. క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు. అన్నదాతలు, దినసరి కూలీలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీ ప్రధాన సూత్రధారుడిగా గుర్తించినట్లు తెలిసింది.
వంశీ లెక్కలు తేల్చేందుకు సిద్ధమైన సర్కార్! - అరాచకాలపై కూలంకషంగా దర్యాప్తు