Youngman from Kurnool got Married to a Japanese Bride : ప్రేమ ఎప్పుడు, ఎక్కడ ఎలా మొదలవుతుందో చెప్పలేం. ప్రాంతాలు, కులాలు, మతాలతో ప్రేమకు సంబంధమే ఉండదు. ఊళ్లు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు వేరైనా ప్రేమలో పడితే పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు. అంత మధురమైనది ప్రేమ. అలాంటి ప్రేమే మన రాష్ట్రానికి చెందిన యువకుడు, జపాన్ యువతి మధ్య మొదలైంది. దేశాలు వేరైనా వారిద్దరూ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అక్కడక్కడా వేరే దేశానికి చెందిన అబ్బాయిని భారతదేశానికి చెందిన అమ్మాయి పెళ్లి చేసుకోవడం లేదా ఇతర దేశానికి అమ్మాయిని మన దేశానికి చెందిన అబ్బాయి పెళ్లి చేసుకోవడం మనం తరచూ పత్రికల్లో వింటూ టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఈసారి అలాంటి వారిలో కర్నూలుకు చెందిన యువకుడు, జపాన్‌కు చెందిన యువతి ఉన్నారు.
తెలుగు వారి పెళ్లిలో జపాన్ బంధువుల సందడి: కర్నూలుకు చెందిన అబ్బాయి, జపాన్ దేశానికి చెందిన అమ్మాయి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే కర్నూలు నగరానికి చెందిన కీర్తి కుమార్ జపాన్ దేశంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తాను పని చేస్తున్న కంపెనీలో జపాన్‌కి చెందిన రింకాతో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దలందరినీ ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నట్లు వరడు కీర్తి కుమార్ తెలిపారు.
"జపాన్‌లో మేమిద్దరం కలిసి ఒకే కంపెనీలో కలిసి పని చేసేవావాళ్లం. అప్పుడు కొద్దిమంది స్నేహితుల ద్వారా రింకా నాకు పరిచయమైంది. ఆ తరువాత కొద్ది రోజులకు మా ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది". - కీర్తి కుమార్,పెళ్లి కుమారుడు
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు సైతం అమ్మాయి కుటుంబ సభ్యులకు నచ్చడంతో ఫైటింగులు, ఛేజింగులు లేకుండానే పెళ్లి బాజాలు మోగాయి. దీంతో వీరి పెళ్లి కర్నూలులోని సీఎస్ఐ చర్చ్‌లో ఇండియా, జపాన్ కుటుంబసభ్యుల మధ్య సందడి వాతావరణంలో జరిగింది.
"భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా మా ఇద్దరి పెళ్లి జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడకు వచ్చిన తరువాత కీర్తి కుటుంబసభ్యులు మమ్మల్ని ఎంతో ప్రేమతో స్వాగతించి చాలా బాగా చూసుకున్నారు. ఈ దేశ సంప్రదాయాలు నాకెంతగానో నచ్చాయి". -రింకా ,పెళ్లి కుమార్తె, జపాన్
ఈ పెళ్లికి వచ్చిన వధూవరుల బంధువులు, స్నేహితులు, జపాన్‌వాసులు ఎంతో సంతోషంగా గడిపారు. ఇక్కడి విశేషాలను వారికి పలువురు విశ్లేషించారు.
నెల్లూరు అబ్బాయి-ప్యారిస్ అమ్మాయి: మరోవైపు ఇలాంటి పెళ్లే నెల్లూరు జిల్లాలోను జరిగింది. కావలికి చెందిన టంగుటూరి వేణుగోపాలకృష్ణ ప్యారిస్‌లో స్థిరపడ్డారు. అతని కుమారుడు అఖిల్ శ్రీనివాస్ అక్కడే పుట్టి పెరిగారు. అతను పని చేస్తున్న సంస్థలోని కొలిగ్ అవిసన్తో స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారింది. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో అందరూ పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. అయితే వీరి వివాహాన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం చేయాలని వేణుగోపాలకృష్ణ నిర్ణయించారు.
అంతే వారంతా ప్యారిస్ నుంచి మన దేశానికి తరలివచ్చారు. బోగోలు మండలంలోని కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం వీరిద్దరి వివాహం జరిగింది. బంధువులు, సన్నిహితులు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎక్కడ ఉన్నా ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మరువలేదని పలువురు ఆ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు.
ఇలా దేశం దాటి వచ్చి ఆలయంలో పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నూతన వధువు అలిసన్ తెలిపారు.
బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఇకపై చట్టం అమలు ఇలా!
బర్త్ డే పార్టీ అన్నారు.. 35 ఏళ్ల వ్యక్తితో 12 ఏళ్ల బాలికకు పెళ్లి చేశారు..!