భవానీపురం జాతీయ రహదారిపై కార్లతో యువకులు హల్‌చల్ - వీడియో వైరల్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 2:48 PM IST

thumbnail

Sunny Gang Hulchul in Bhavanipuram: ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది యువకులు పుట్టినరోజు వేడుకలు, స్నేహితుల పెళ్లి వేడుకలను పురస్కరించుకుని స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోన్న సంఘటనలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. జాతీయ రహదారులపై ఇష్టారీతిగా హారన్లు మోగిస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో సన్నీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

జరిగిన సంఘటన ఇది: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో నిన్న (ఆదివారం) సాయంత్రం సన్నీ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేశారు. పోలీసు వాహనాల సైరన్‌ కలిగిన పది కార్లతో ఒక్కసారిగా రోడ్లపై దూసుకెళ్లి, బీభత్సం సృష్టించారు. పది కార్లు ఒకేసారి పోలీసు సైరన్‌ మోగిస్తూ, ర్యాలీగా జాతీయ రహదారిపై వెళ్లడంతో స్థానికులు, వాహనాదారులు భయభ్రాంతులకు గురయ్యారు. సన్నీ స్నేహితుడి వివాహం పోరంకిలో జరిగింది. ఈ క్రమంలో సన్నీ గ్యాంగ్‌ కార్లతో భవానీపురం క్రాంబ్వే రహదారి, స్వాతి సెంటర్‌, కనకదుర్గ పైవంతెన మీదుగా ర్యాలీగా వెళ్తూ, అరుపులు, కేకలతో హంగామా చేశారు. దీంతో స్థానికులు ఏం జరుగుతుందో అర్ధంకాక ఆందోళన చెందారు. మరోవైపు కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో రహదారిపై పుట్టిన రోజు నిర్వహించారు. ఆరోజు కూడా వాహనాలతో ప్రదర్శన చేపట్టి, నానా రచ్చ చేశారు. అయినా పోలీసులు యువకులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఈ సందర్భంగా భవానీపురం స్టేషన్‌ సీఐ మాట్లాడుతూ పోలీసు వాహనాల హారన్‌ మోగిస్తూ కార్ల ప్రదర్శన నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. త్వరలోనే బాధ్యులపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.