5 KG GOLD THEFT CASE: గుంటూరు జిల్లా మంగళగిరిలో 5 కిలోల బంగారం అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. విజయవాడలోని బంగారు దుకాణం నుంచి మంగళగిరి మండలం ఆత్మకూరు జాతీయ రహదారి వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని క్షుణ్ణంగా పరిశీలించారు. విజయవాడ నుంచి ఆత్మకూరు వరకు దొంగతనం జరిగిన తీరును పోలీసులు ఆదివారం రీ క్రియేట్ చేశారు.
విజయవాడ బంగారు దుకాణం నుంచి బాధితుడు నాగరాజు ఆభరణాలు తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతన్ని వెంబడించినట్లు గుర్తించారు. పల్సర్ బైక్‌పై నాగరాజును అనుసరిస్తున్న దృశ్యాలను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సేకరించారు. ముగ్గురు అనుమానితులు ఎవరు? ఎక్కడినుంచి వచ్చారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరో రెండు రోజుల్లో కేసిన ఛేదిస్తామని పోలీసులు వెల్లడించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?: ఆత్మకూరు జాతీయ రహదారి జంక్షన్ వద్ద బంగారం చోరీ ఘటన శనివారం కలకలం రేపింది. ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో దొంగతనం జరగడంపై తొలుత పోలీసులు అనుమానం చేశారు. బైక్‌పై 5 కిలోల బంగారు ఆభరణాలను తీసుకెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగ్ లాక్కుని పారిపోయారని బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళగిరిలో నివాసం ఉంటున్న దివి రాము అనే వ్యక్తి విజయవాడలో బంగారం దుకాణం నడుపుతున్నారు. అతని వద్ద పని చేస్తోన్న బంధువు నాగరాజు బంగారు ఆభరణాలతో శనివారం రాత్రి స్కూటీపై ఇంటికి వస్తుండగా, ఆత్మకూరు అండర్ పాస్ జంక్షన్ వద్ద రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు యువకులు బ్యాగ్ లాక్కొని పారిపోయారని బాధితుడు తెలిపారు. అయితే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక దుకాణదారులను ప్రశ్నించగా, అలాంటిదేమీ జరగలేదని చెప్పారు.
బంగారం విలువ సుమారు రూ.4 కోట్ల వరకు ఉంటుంది. నాగరాజు సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. నాగరాజు అనే వ్యక్తి రాత్రి 8:30 నుంచి 9:15 గంటల వరకు ఇతరులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అతను ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు అనే వివరాలను పోలీసులు సేకరించారు. అసలు దొంగతనం జరిగిందా, లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.