Mahakumbh of Temples in Tirupati Starting From Today : నేటి నుంచి మూడు రోజుల పాటు తిరుపతి వేదికగా అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన-2025 (ఐటీసీఎక్స్) నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ప్రసాద్‌లాడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఐటీసీఎక్స్, అంత్యోదయ ప్రతిష్ఠాన్ ప్రతినిధులు గిరీష్ కులకర్ణి, నీతాలాడ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. వారణాసిలో 2023లో మొదటి దేవాలయాల మహాకుంభ్ నిర్వహించామని, ఇప్పుడు తిరుపతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రధాని మోదీ కలలుగన్న వికసిత్ భారత్ సాకారంలో దేవాలయాలు భాగస్వామ్యం కావాలని, వాటి ఆర్థిక పరిపుష్టికి బలమైన పునాదులు వేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టెంపుల్ కనెక్ట్ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మంగళం సమీపంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే సదస్సులో 58 దేశాల్లోని 1,581 ఆలయాలకు సంబంధించిన 111 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు.
సోమవారం (నేడు) సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని గిరీష్ కులకర్ణి వెల్లడించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మూడు రోజుల సదస్సులో ఒకరోజు పాల్గొంటారని, 19వ తేదీన మంత్రి నారా లోకేశ్ హాజరవుతారని వివరించారు. మొత్తం 15 వర్క్‌షాప్‌లు నిర్వహించి 60 స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
తిరుమలకు సీఎం పర్యటన : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 3:50 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆశా కన్వెన్షన్ హాలుకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 6:15 గంటలకు విమానాశ్రయం చేరుకుని విజయవాడ బయల్దేరనున్నట్లు సమాచారం.
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు పట్టింది. శ్రీవారి సర్వదర్శనానికి 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం 79,705 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,836 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు.