"మెనూ ప్రకారం భోజనం లేదు.. అడిగినందుకు వార్డెన్ మోకాళ్లపై నడిపిస్తోంది"
Govada BC Girls Hostel : మెనూ ప్రకారం భోజనం ఏదని ప్రశ్నినందుకు కొడుతున్నారు. రాగి జావ అందించలేదని అడిగినందుకు మోకాళ్లపై నడిపిస్తున్నారు. అంతే కాకుండా వార్డెన్ వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని.. అనకాపల్లి జిల్లా గోవాడ బీసీ బాలికల వసతి గృహంలోని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టటం లేదని అన్నారు. రోజు బంగాళదుంప కూర వడ్డిస్తున్నారని, అన్నంలో పురుగులు ఉంటున్నాయని, హాస్టల్ అందించే బిర్యాని ముద్దగా ఉంటోందని తెలిపారు. గోధుమ పిండిలో పురుగులు ఉంటున్నాయని వివరించారు. ఇదేంటని వార్డెన్‌ను అడిగితే వారిపై వార్డెన్ దురుసుగా ప్రవర్తిస్తోందని.. చిత్రహింసలకు గురి చేస్తోందని ఆరోపించారు.
ఈ విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు వసతి గృహానికి వచ్చి.. వార్డెన్‌ను నిలదీశారు. దీంతో ఆమె వారికి వివరణ ఇస్తూ.. మెనూ ప్రకారమే హస్టల్లో భోజనం అందిస్తున్నామని తెలిపారు. మెనూ పక్కగా అమలు చేస్తున్నామని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగానే చూసుకుంటున్నామని వివరించారు. వార్డెన్ తీరుపై ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బాలికల తల్లిదండ్రులు తెలిపారు.