జైళ్ల సందర్శనకు ఛార్జీల వసూలు, ప్రైవేటు విద్యాసంస్థలపై భారం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 12:04 PM IST
State Government Says Central Jails Visiting Charges: ఇప్పటికే వివిధ రకాల పన్నులు, ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం విద్యార్థులను సైతం వదలడం లేదు. అధ్యయన యాత్రల్లో భాగంగా రాష్ట్రంలోని జైళ్లను సందర్శించాలనుకునే ప్రైవేటు విద్యాసంస్థల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని హోంశాఖ నిర్ణయించింది. జైళ్లకు పెరుగుతున్న పర్యటనల దృష్ట్యా వాటిని నియంత్రించేందుకు యూజర్ ఛార్జీలను పెట్టాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకరోజుకి రూ.5వేలు, రెండు రోజులకి రూ.7,500, మూడు రోజులకు రూ.10వేలను యూజర్ ఛార్జీలుగా వసూలు చేయాలని నిర్ణయించారు.
సందర్శకులు జైళ్లలోని ఖైదీలు, అధికారులతోనూ ఇంటర్యూలు చేయటం ఇతరత్రా అంశాలు.. జైళ్ల పరిపాలనలో ఇబ్బందులు కలిగిస్తున్నందున వాటిని నియంత్రించేందుకు యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్టడీ టూర్ల కింద వచ్చే విద్యార్ధుల గరిష్ట సంఖ్య 50కి పరిమితం చేయాలని కూడా నిర్ణయించారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు జైలు సందర్శనకు అనుమతి కోరితే యూజర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. యూజర్ ఛార్జీలను చెక్కు లేదా డీడీ రూపంలో చెల్లించాలని.. వసూలు చేసిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రిజన్ డెవలప్‌మెంట్ బోర్డు నిధికి జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.