Narapura Venkateswara Rathotsavam: వైభవంగా నారాపుర వెంకటేశ్వరస్వామి రథోత్సవం - rathotsavam in jammalamadugu
🎬 Watch Now: Feature Video
Narapura Venkateshwara Swamy Rathotsavam: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నారాపుర వెంకటేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన రథోత్సవం.. మధ్యాహ్నం విరామం అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా భక్తులకు దాతలు తాగునీరు, మజ్జిగ, పానకం, శీతల పానీయాలతోపాటు భోజన వసతి కల్పించారు. నారాపుర వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడో రోజు స్వామివారి రథోత్సవం కనుల పండువగా సాగింది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి తేరును లాగారు. ఆలయం ఆవరణ నుంచి ప్రారంభమైన రథం ఊరేగింపు తేరు రోడ్డు, తాడిపత్రి రోడ్డు మీదుగా పాత బస్టాండులోని గాంధీ కూడలి వరకు సాగింది. మధ్యాహ్నం మెయిన్ బజారులోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు రాగానే నిలిపేశారు. తిరిగి 3.30 గంటలకు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించారు. మెయిన్ బజార్, కన్యకాపరమేశ్వరీదేవి ఆలయం, పలగాడి వీధి మీదుగా నారాపుర వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలోకి సాయంత్రం 5 గంటలకు వాహనం చేరుకోవడంతో రథోత్సవం ముగిసింది. ప్రారంభం నుంచి రథాన్ని లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. రథం ఆగిన చోట రథ చక్రాలకు మహిళలు టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.