BJP Somu Veeraju 6 నెలలుగా రాష్ట్రంలో రూ. 2000 నోటు కనిపించడం లేదు: సోము వీర్రాజు
Somu Veerraju on 2000 notes: రూ.2 వేల నోటును రద్దు చేయడం ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 6 నెలలుగా రూ.2 వేల నోట్లు కనిపించడం లేదని వీర్రాజు వెల్లడించారు. రూ.2 వేల నోటును రద్దు చేయడం వల్ల సామాన్యులకు ఎటువంటి నష్టం లేదన్నారు. రాష్ట్రంలో రూ.2 వేల నోట్లు ఎక్కడికి పోయాయో ఆర్థం కావడం లేదన్నారు.
అనంతరం సోము వీర్రాజు ఉద్యోగుల సమస్యలపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు పిలుపు ఇవ్వడం ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 25వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రధాని మోదీ 9 యేళ్ల పాలన పూర్తి అయిన సందర్భంగా 13 రకాల కార్యక్రమాల నిర్వహిస్తున్నామని చెప్పారు. మే 30 నుంచి జూన్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేశామన్నారు. సర్పంచ్ల పని తీరుపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరితే భారీగా అవినీతి బయటకు వస్తుందన్నారు.