Soil Mining ఎన్టీఆర్ జిల్లాలో చెలరేగిపోతోన్న మట్టి మాఫియా.. హడలెత్తుతోన్న ప్రజానికం
🎬 Watch Now: Feature Video
Illegal and Rampant Mining in NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకొని నిబంధనలను తుంగలో తొక్కుతూ పలు గ్రామాల్లోని చెరువుల్లో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని చెరువుల్లో తవ్వకాలు చేస్తూ అధికార పార్టీ నాయకులు అక్రమాలకు తెరలేపారు. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి, గండ్రాయి, వత్సవాయి మండలంలోని రామచంద్రపురం, కన్నెవీడు, సింగవరం, మక్కపేట, ఖమ్మంపాడు, పెంటాల వారి గూడెం, పెనుగంచిప్రోలు మండలంలోని కొనకంచి చెరువుల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. చెరువుల్లో మట్టి తవ్వకాలు చేపట్టాలంటే రెవెన్యూ, జలవనరుల శాఖల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయా గ్రామాల వైసీపీ నాయకులు ఎటువంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేస్తున్నారు. నిబంధనల మేరకు చెరువుల్లో ఎంత మట్టి తీయాలి.. ఎక్కడెక్కడ తీయాలి అనే విషయాలను అధికార యంత్రాంగం గుర్తించాల్సి ఉంది.. కానీ అవేమీ లేకుండా ఇష్టానుసారంగా చెరువుల్లో ఎక్కడపడితే అక్కడ లోతైన గుంతలు పెడుతూ తవ్వకాలు చేస్తున్నారు. ఇవి వర్షాకాలంలో ప్రమాదాలకు కారకాలుగా మారుతున్నాయి. ఈ గుంతల్లో పడి మనుషులతో పాటు పశువులు కూడా మృతి చెందిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చెరువుల్లో తీయాల్సిన మోతాదు కంటే అదనంగా తీయడం వల్ల తూములకు నీరు ఎక్కటం లేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చెరువుల్లో లభిస్తున్న గ్రావెల్ విలువైనది కావడంతో అక్రమార్కులు దానిని సొమ్ము చేసుకునేందుకు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తున్నారు.