'జే బ్రాండ్'తో పేదల ప్రాణాలు తీస్తున్నారు - మహిళలు జాగృతమైతేనే మార్పు : సోమిరెడ్డి
🎬 Watch Now: Feature Video
Simhapuri Sri Shakti Forum in Nellore District : జే బ్రాండ్ (J Brand) మద్యంతో రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో భర్తల ప్రాణాలు తీస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో నెల్లూరులో (Nellore) నిర్వహించిన "సింహపురి స్త్రీ శక్తి" చర్చా వేదికలో సోమిరెడ్డి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించామని తెలిపారు. మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఆ మాటే మర్చిపోయారని మండిపడ్డారు. జే బ్రాండ్‌లతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏపీని బ్యాంకులు బ్లాక్ లిస్ట్‌లో పెడితే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో మహిళలు అవమానాలకు గురవుతున్నారని తెలిపారు. మహిళలు జాగృతమైతే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇసుక నిర్వహణను డ్వాక్రా మహిళలు చక్కగా నిర్వహించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. 2024 సంవత్సరంలో జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలి అని సోమిరెడ్డి పిలుపునిచ్చారు.