No Power in Govt Hospital: వర్షానికి విద్యుత్ కట్.. జనరేటర్ ఉన్నా చీకట్లోనే రోగులు
🎬 Watch Now: Feature Video
Saluru town Community Health Center: అది ఓ ప్రభుత్వ ఆసుపత్రి.. ఆ చుట్టుపక్కల గ్రామాలకు ఆ ఆసుపత్రే పెద్ద దిక్కు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఆసుపత్రిలో వసతులు కరువై చీకటి రాజ్యమేలుతోంది. రోగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ఆసుపత్రిలో.. అంధకారం నెలకొన్న నేపథ్యంలో రోగుల పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ (సామాజిక ఆరోగ్య కేంద్రం) ప్రభుత్వ ఆసుపత్రిలో దౌర్భాగ్య స్థితి నెలకొంది. సాలూరు నియోజకవర్గంలోని పాచిపెంట, మక్కువ, సాలూరు.. మెుదలుగు గ్రామీణ ప్రాంతాల వారికి సాలూరు పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రే దిక్కు. చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలు, అలాగే స్థానిక ప్రజలకు రోగం వస్తే అందుబాటులో ఉన్న ఆసుపత్రి ఇది. అయితే, ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
మధ్యాహ్నం కురిసిన వర్షానికి, గాలి కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆసుపత్రిలో జనరేటర్ ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. విద్యుత్ పోయినప్పటికీ జనరేటర్ ఆన్ చేయకుండా వైద్యం కోసం వచ్చిన రోగులను సిబ్బంది చీకట్లలోనే ఉంచారు. విద్యుత్ విషయమై రోగులు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా.. సరైన సమాధానం ఇవ్వలేదని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రికి ఈ మధ్య కాలంలోనే కొత్త జనరేటర్ వచ్చిందనీ, అయినా.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో జనరేటర్ ఆన్ చేయకుండా రోగులను చీకట్లోనే ఉంచారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై అక్కడే ఉన్న డాక్టర్ను ప్రశ్నిస్తే.. మరో అధికారిని కనుక్కోని చెబుతానని సమాధానం ఇచ్చారు. సమయానికి ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ సైతం అక్కడ లేడని తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.