Roads,Drainage Worst Condition in Auto Nagar : ఆటోనగర్లో అధ్వానంగా పారిశుధ్యం.. పట్టించుకోని అధికారులు..ఇబ్బందుల్లో కార్మికులు
🎬 Watch Now: Feature Video
Roads Drainage Worst Condition in Auto Nagar : సుమారు లక్ష మంది కార్మికులు పని చేస్తున్న విజయవాడ ఆటోనగర్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. ప్రధానంగా గుంటతిప్ప కాలువ, దానికి ఆనుకొని ఉన్న రహదారి మురుగు, చెత్తాచెదారంతో నిండిపోయింది. దీంతో దోమలు, ఈగలు చేరి అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని చుట్టుపక్కల పరిశ్రమల్లో పని చేసే కార్మికులు చెబుతున్నారు. నిత్యమూ వందలాది మంది రాకపోకలు సాగించే ఈ రహదారిలో ప్రయాణించాలంటే నరకం చూడాల్సి వస్తోందని వాహనదారులు, కార్మికులు వాపోతున్నారు. మురుగు ద్వారా వచ్చే దుర్వాసనకు తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటోనగర్ లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సుమారు 3వేలు ఉన్నాయి. అయినా మురుగు సమస్య తీర్చడంలో సంబంధిత అధికారులు తీవ్రంగా విఫలమయ్యారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తీసి వారాలు గడుస్తున్న ఆ చెత్తను డంపింగ్ యార్డులకు తరలించడం లేదు. దీంతో రహదారి మొత్తం చెత్త, చెదారంతో మూసుకుపోతోంది. మురుగు ద్వారా వచ్చే దుర్వాసనతో వాహనదారుల తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు రోడ్డుపై చెత్త చెదారం, మురుగు తొలగించాలని ఆటోనగర్ కార్మికులు, వాహనదారుల వేడుకుంటున్నారు.