రిటైర్డ్ ప్రొఫెసర్ గొప్ప మనసు - గార్లదిన్నె జడ్పీ హైస్కూల్లో 65 లక్షలతో భోజనశాల నిర్మాణం - జిల్లావార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 7:13 PM IST
Retired Professor Lakshmirao 65 lakhs Donation for School Canteen: అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండల కేంద్రంలో పుట్టిన ఊరిని అభివృద్ధి చేయాలనే తపనతో ఓ కుటుంబం ముందుకు వచ్చింది. అందుకోసం అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకు శాశ్వతమైన సౌకర్యం కల్పించడం ద్వారా.. పది మందికి ఆదర్శంగా నిలవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రధానోపాధ్యాయుడిని కలిసి తాము చేయదలచుకున్న పనిని తెలిపారు. తమ స్కూల్లో భోజనశాల ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉపాధ్యాయుడు వారికి సూచించారు. వెంటనే స్పందించిన ఆ కుటుంబం.. పిల్లలంతా కలిసి మధ్యాహ్నం ఒకే దగ్గర కూర్చొని తినేందుకు అనువుగా ఉండే భోజనశాలను నిర్మించారు. నేడు భోజనశాలను నిర్మాణకర్త చేతుల మీదుగా ప్రారంభించారు.
భోజనశాల ప్రారంభించిన అనంతరం రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మీరావు మాట్లాడుతూ... తాము పుట్టి పెరిగిన స్వంత ఊరికి ఎదైనా చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అందు కోసమే పిల్లలకు ఉపయోగపడే విధంగా భోజనశాల నిర్మించినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణంలో విశాలమైన భోజనశాలను నిర్మించామని, అందుకు రూ.65 లక్షలు ఖర్చు అయినట్లు వెల్లడించారు. తమ అత్తమామలు హనుమంతరావు, గౌరమ్మల జ్ఞాపకార్థం నిర్మాణం చేపట్టినట్లు లక్ష్మీరావు తెలిపారు. స్కూల్ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. భోజనశాలతో పాటు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. లక్ష్మీరావు ప్రయత్నాన్ని గ్రామస్థులు అభినందించారు. గ్రామానికి సహాయం చేయాలనే తపనతో ముందుకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. స్కూల్ పిల్లల కోసం నిర్మించిన ఈ భవనంలో అన్ని హంగులను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు ఎంపీడీవో విజయభాస్కర్, మండల విద్యాధికారి తారాచంద్రానాయక్, డీఎల్‌డీవో ఓబుళమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకన్న, లక్ష్మీరావు బంధువు రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.