GVL fires on CM Jagan: చేతకాకుంటే సీఎం పదవి నుంచి దిగిపోవాలి: జీవీఎల్ - బాపట్ల జిల్లాలో విద్యార్థిపై దాడి
🎬 Watch Now: Feature Video
BJP leader GVL Narasimha Rao lashed out at CM Jagan : రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు అధ్వాన్నంగా మారి.. వాస్తవాలు వెగటుపుట్టించేలా ఉంటున్నా.. అంతా బాగుందనేలా డీజీపీని ముందుకు పంపించి ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రికి సిగ్గుగా అనిపించడం లేదా అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. సామాన్య ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోతోందని.. ఏ ఘటన జరిగినా దాన్ని పార్టీ పరంగానో, కులపరంగానో చూస్తూ తమ పార్టీ నేతలను పంపించి పరిహారం ఇప్పించడం అపహాస్యంగా ఉందని మండిపడ్డారు. తమది రాక్షస సంత అని చెప్పుకోండని, ప్రజాస్వామ్య పద్ధతులు, ఆధునిక నాగరికతతో సంబంధం లేదని ప్రకటించుకోవాలంటూ విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవీఎల్ విరుచుకుపడ్డారు. విశాఖలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, తాము మూడేళ్ల నుంచి వివిధ సందర్భాల్లో చెబుతూ వస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని శాంతి భద్రతలకు చెందిన పూర్తిస్థాయి నివేదికలు హోంశాఖ మంత్రి అమిత్‌షా వద్ద ఉన్నాయని, అందులోని అంశాల ఆధారంగానే ఈనెల 11న విశాఖ పర్యటన సమయంలో ప్రస్తావించారన్నారని తెలిపారు.
రాజకీయ కోణంలో అమిత్ షా మాట్లాడలేదని, అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబానికే రక్షణ లేని పరిస్థితి విశాఖలో ఉండడం దురదృష్టకరమని జీవీఎల్ పేర్కొన్నారు. తమకు సమాచారం రాగానే స్పందించి కాపాడినట్లుగా చెప్పడం సరికాదని, సమాచారాన్ని ఎందుకు పోలీసులకు ఇవ్వలేకపోయారనే విషయంలో ఎంపీ కుటుంబాన్ని కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో శాంతికి మారు పేరైన విశాఖలో క్రైం థ్రిల్లర్ ను మరిపించేలా ఘటన జరిగిందన్న జీవీఎల్.. బాపట్ల జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉదంతం అత్యంత హృదయ విదారకరమన్నారు. బాధిత విద్యార్థి కుటుంబానికి ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేనిపక్షంలో చేతకాకుంటే తన పదవి నుంచి దిగిపోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.