Railway Track Restoration Works completed in AP: గంటల వ్యవధిలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ.. రాకపోకలకు అంతా సిద్ధం
🎬 Watch Now: Feature Video
Railway Track Restoration Works completed in AP: ప్రమాదం జరిగిన గంటల వ్వవధిలోనే రైల్వే లైన్‌ను అధికారులు పునరుద్ధరించారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాద స్థలంలో ధ్వంసమైన ట్రాక్‌లను.. రైల్వే అధికారులు శరవేగంతో కేవలం 19 గంటల్లోనే పునరుద్ధరించారు. విశాఖ-విజయనగరం డౌన్‌లైన్ ట్రాక్‌వైపు అధికారులు గూడ్స్‌తో ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం ఆదే ట్రాక్‌పై ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను విజయవంతంగా నడిపారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం భీమాలి వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంతో దెబ్బ తిన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు కొలిక్కి వచ్చాయి. ఇప్పటికే ట్రాక్‌ను సిద్ధంచేసిన అధికారులు తొలుత గూడ్స్‌ను నడిపారు. తర్వాత ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను ఆ మార్గంలో పంపించారు. అటు ఈ దుర్ఘటనలో గాయపడినవారికి విశాఖ కేజీహెచ్‌కు, విజయనగరం ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన 14 మంది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందినవారిగా అధికారులు గుర్తించారు. ఇందులో విశాఖకు చెందిన లోకో పైలెట్ ఎస్ఎమ్ఎస్ రావు, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన గ్యాంగ్‌మన్ చింతాల కృష్ణం నాయుడు, పలాస ప్యాసింజర్ గార్డు ఎం. శ్రీనివాస్ ఉన్నారు. మిగిలిన 11 మంది మృతులు ప్రయాణికులు అని అధికారులు తెలిపారు. గతరాత్రి 9గంటల నుంచే సహాయ పనులు చేపట్టిన రైల్వేసిబ్బంది.. విశాఖ నుంచి తెప్పించిన భారీ క్రేన్ల సాయంతో పట్టాలపై పడిన బోగీలను తొలగించారు. అటు ప్రమాద ఘటనపై అన్ని విభాగాల అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ట్రాక్‌పై ఉన్న విశాఖ-పలాస రైలును.. వెనక నుంచి విశాఖ-రాయగడ రైలు ఢీకొంది. ఈ ఘటనలో రెండు ప్యాసింజర్లు, గూడ్స్ రైళ్లవి కలిపి ఏడు బోగీలు దెబ్బతిన్నాయి.