Purandeshwari on Chandrababu Arrest చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను.. బీజేపీ ఆపాదించడం సరికాదు: పురందేశ్వరి స్పందన - Purandeshwari news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 20, 2023, 5:23 PM IST
Purandeshwari on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్టును భారతీయ జనతా పార్టీకి ఆపాదించడం సబబు కాదని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 73వ జన్మదినం సందర్భంగా ఆమె ఏలూరులో నిర్వహించిన సేవా పక్షోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం స్థానిక సుఖీభవ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి.. ప్రధానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.
Purandeshwari Response to Chandrababu Arrest: దగ్గుబాటి పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సరైంది కాదని.. మొదట ఖండించింది, చెప్పింది తామేనని ఆమె అన్నారు. సీఐడీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్న పురందేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్‌పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అతి త్వరలోనే అసలు విషయం తెలుస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.
Purandeshwari Comments: "నాణ్యతలేని మద్యం ద్వారా ప్రజల ప్రాణాలు పోతున్నా, రాష్ట్ర ప్రభుత్వం జేబులు నింపుకోవాలని చూడటం దారుణం. త్వరలోనే ఈ విషయాన్ని సీబీఐ, కేంద్ర హోంశాఖకు లేఖ ద్వారా తెలియజేస్తాం. ఎంతో మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దానిపై మా పార్టీ ఇప్పటికీ పోరాటం చేస్తోంది. పొత్తులపై మాకు స్పష్టత ఉంది. పవన్ కల్యాణ్ ఏ పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ప్రకటించారో ఆ విషయాన్ని మా పార్టీ అధిష్ఠానికి వెల్లడిస్తాం. ఆ తర్వాత పార్టీ ఆదేశానుసారం పనిచేస్తాం. మహిళా సాధికారత బీజేపీతోనే సాధ్యం. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును మోదీ హయాంలోనే ఆమోదానికి సిద్ధమవ్వడం దానికి నిదర్శనం.''