Protest Against YSRCP Leaders in Hindupuram: హిందూపురంలో ఉద్రిక్తత.. వైసీపీ నాయకులను అడ్డుకున్న స్థానికులు - Sri Sathya Sai District villages News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 10:07 PM IST
Protest Against YSRCP Leaders in Hindupuram: 'జగనన్న సురక్ష' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిరసన సెగలు తప్పటం లేదు. గ్రామాలు, పట్టణాలోని వీధులకు వెళ్లి ప్రజల సమస్యలపై ఆరా తీసేలోపే తమ కాలనీలకు ఎందుకొచ్చారంటూ స్థానికులు నిలదీస్తున్నారు. ఓట్లేసి గెలిపించినందకు తమ కాలనీకి ఏం చేశారో..? చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో చేసేదేమీ, చెప్పేదేమీ లేక నేతలు వెనుదిరుగుతున్నారు. ఈ మేరకు జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరుకావాలంటూ ప్రచారం కోసం వెళ్లిన నేతలను ఆటోనగర్ స్థానికులు అడ్డుకున్నారు.
Tension Atmosphere in Hindupur: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నేతలకు ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. హిందూపురం పట్టణ సమీపంలోని ఆటోనగర్‌లో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమానికి రావాలంటూ ప్రచారం కోసం వెళ్లిన వైసీపీ నాయకులపై స్థానికులు విరుచుకుపడ్డారు. 'మా ప్రాంతంలో ఏ మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేశారో చెప్పండి. మురికి కాలువలు, డ్రైనేజీ నిర్మాణాల కోసం నాయకుల చుట్టు, అధికారుల చుట్టు తిరిగి తిరిగి అలసిపోయాం. ఇప్పుడు జగనన్న కార్యక్రమానికి రమ్మని మా ప్రాంతంలో ఎలా పర్యటిస్తున్నారు' అంటూ స్థానికులు ప్రశ్నించారు. దీంతో కంగు తిన్న వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు.. 20 రోజుల్లో రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నాయకుల హామీల మీద నమ్మకంలేదన్న స్థానికులు.. జగనన్న కార్యక్రమానికి హాజరుకాలేమని తేల్చిచెప్పారు. దీంతో వైసీపీ నాయకులు, ఆటోనగర్ స్థానికులకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది.