పొలాలు, చెరువుగట్లు ముళ్ల పొదలు - చివరి మజిలీకి ఎన్నెన్నో కష్టాలు - Poor maintenance of burial grounds
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 9:32 PM IST
Problem of Cremation Grounds in Srikakulam District : మరణించిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు కనీసం దారిలేక శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు మండలాల్లో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా మృత్యువాత పడితే వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లడానికి బంధువులు, గ్రామస్థులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆమదాలవలస మండలంలోని కొర్లకోట, ఏసర్ల పేట గ్రామాల్లో ఎవరైనా చనిపోతే పంట పొలాలు, చెరువుగట్లు, ముళ్ల పొదల్లోంచి శ్మశాన వాటికకు వెళ్లవలసి వస్తుందని స్థానికులు వాపోతున్నారు. సరుబుజ్జిలి మండలంలోని సేలంత్రి గ్రామంలో ఎవరైనా మృతి చెందితే కాలువలోంచి వెళ్లవలసి వస్తుందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. బూర్జ పొందూరు మండలం పెద్దిపేటలోని శ్మశాన వాటికకు దారి లేక నరకయాతన పడుతున్నామని ఆ గ్రామస్థులు తెలిపారు. నియోజకవర్గంలో చాలా గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొందని ప్రజలు వివరించారు. ప్రభుత్వం తక్షణం స్పందించి శ్మశాన వాటికకు దారులు నిర్మించాలని, అలాగే శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.