Pregnant Women Died in Hospital : కాన్పు కోసం వెళ్తే.. తల్లీ, శిశువు మృతి.. హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన - అనంతపురం లోకల్ వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 2:35 PM IST
Pregnant Women Died in Anantapur: అనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, ఆ శిశువు ఇద్దరు మృతి చెందిన ఘటన విషాదంగా మారింది. వైద్యం వికటించడంతోనే తల్లి, బిడ్డ మృతి చెందారని.. ఆమె బంధువులు ఆ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం రఘుపల్లి గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే గర్భిణి నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆమె డెలివరీ కోసం హాస్పిటల్కు వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం మహాలక్ష్మి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
రాత్రి 9 గంటలకు శిశువు మృతి చెందింది. శిశువు చనిపోయినా.. మహాలక్ష్మి క్షేమంగా ఉంటుందని బంధువులంతా అనుకున్నారు. కానీ, అర్ధరాత్రి 12 గంటలకు మహాలక్ష్మి కూడా మృతి చెందింది. సరైన వైద్యం అందించకపోవడంతోనే తల్లీ, శిశువు మృతి చెందారని హాస్పిటల్ ఎదుట ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ వారు అంతా బాగుందని చెప్పారని.. కానీ ఇప్పుడు తల్లి, బిడ్డ ఇద్దరు మృతి చెందారని మహాలక్ష్మి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహాలక్ష్మి బంధువులకు సర్ది చెప్పి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.