PRATHIDWANI: ఏకోపాధ్యాయ పాఠశాలలు.. ఏపీ రెండో స్థానంలో నిలవడం దేనికి సంకేతం? - ఏకోపాధ్యాయ బడుల వార్తలు
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో పాఠశాల విద్య వాస్తవ పరిస్థితి ఏమిటి? కొంతకాలంగా గందరగోళంగా మారిన పరిస్థితుల్లో ఈ ప్రశ్న మరోసారి తెరపైకి రావడానికి కారణం.. పార్లమెంట్‌లో కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన సమాధానం. యూడైస్ ప్లస్ నివేదిక -2021 ప్రకారం... ఏకోపాధ్యాయ పాఠశాలల్లో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఏకంగా 12వేల 386 పాఠశాలల ఒకరే టీచర్‌లో నెట్టుకుని వస్తున్నాయి. 2017లో 7వేల 483 ఏకోపాధ్యాయ పాఠశాలలతో దేశంలో ఐదో స్థానంలో ఉండగా.. ఇప్పుడు రెండోస్థానానికి చేరింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట పాఠశాల విద్యాశాఖ ఒక్కరినే నియమిస్తున్నందున.. విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నిచోట్ల 5 తరగతులకూ ఒకే ఉపాధ్యాయుడు అన్ని సబ్జెక్టుల్ని బోధిస్తుండగా.. మరికొన్నిచోట్ల ఒకటి, రెండు తరగతులకు చెబుతున్నారు. ఇలాంటిచోట ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాలలు మూతపడుతున్నాయి. దీనివల్ల బోధన గాడి తప్పుతోంది. గత మూడున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అన్ని తరగతుల పిల్లలనూ ఒకే గదిలో కూర్చోబెడుతున్నారు. పిల్లల అభ్యసన సరిగా లేకపోయినా తర్వాతి తరగతులకు పంపేస్తున్నారు. విద్యార్థులకు ఎంతవరకు పాఠాలు అర్థమయ్యాయి, ఎంతవరకు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారనే విషయాన్ని పట్టించుకోవడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. ఏకోపాధ్యాయ బడుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా బోధించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండవ స్థానంలో నిలవడం దేనికి సంకేతం? అసలు రాష్ట్రంలో పాఠశాల విద్యావిధానం ఎలా ఉంది..? ఉపాధ్యాయులు, మేధావులు ఈ పరిణామాలపై ఏమంటున్నారు... ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ. ఈ చర్చలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు.