PRATHIDWANI: రాష్ట్రంలో నడుస్తున్నది ఏ రాజ్యాంగం..? - రాష్ట్రంలో వైసీపీ రాజ్యాంగం
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో అమలౌతోంది ఐపీసీ చట్టమైతే ఫర్వాలేదు.. కానీ ఇక్కడుంది వైసీపీ చట్టం. అది అధికార పార్టీకే చుట్టం.. అధికార పార్టీని ఎవరైనా పల్లెత్తు మాట అంటే చాలు పౌరుషం పుట్టుకొస్తుంది. అంతెందుకు సోషల్ మీడియాలో చిన్న పోస్టింగ్ పెట్టినా చాలు.. నోటీసులంటూ వెంటాడుతారు. అదే ప్రతిపక్షపార్టీల వారిని.. అధికార పార్టీ నేతలు బండబూతులు తిట్టినా, కర్రలతో చావబాదినా.. మందలుమందలుగా వెళ్లి ఇళ్లు తగలబెట్టినా సరే కళ్లప్పగించి చూస్తారు. పైపెచ్చు బాధ్యులపై కాకుండా బాధితులపైనే రివర్స్ కేసులు బనాయిస్తారు.
ఎస్సీ, ఎస్టీలను దూషించారనో, పోలీస్ విధుల్ని అడ్డుకున్నారనో.. కొత్తకొత్త సెక్షన్లు వెతికి మరీ సంకెళ్లు వేస్తారు. వీలైతే థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగిస్తారు. అధికారపార్టీకి దాసోహమైన.. ఏపీ పోలీస్ వ్యవస్థ చట్టాన్ని వైసీపీ చుట్టంగా మార్చేసింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటవిక రాజ్యాలతరహాలో అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.
అధికార, విపక్షాలు గొడవపడితే ఒక్కొక్కరికీ ఒక్కో ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు మన ఖాకీలు. ప్రతిపక్షపార్టీ వాళ్లపై బెయిల్‌కు వీల్లేని సెక్షన్లు పెట్టేస్తారు. అదే అధికార పార్టీ వాళ్లపై స్టేషన్ బెయిల్‌తో బయటకు పంపే సెక్షన్లతో.. సరిపెట్టేస్తారు. కళ్లెదుటే వైఎస్సార్సీపీ శ్రేణులు బరితెగించి దాడులు, విధ్వంసాలు, దహనాలకు తెగబడుతుంటే ఉక్కుపాదంతో అణిచేయాల్సింది పోయి.. బాబ్బాబు అంటూ బతిమలాడుకుంటారు. గన్నవరంలో.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులే దీనికి తాజా నిదర్శనం.
రాష్ట్రంలో నడుస్తున్నది ఏ రాజ్యాంగం.. పోలీసు బాసులు అమలు చేస్తున్నది ఏ పీనల్ కోడ్.. అందరి చర్చ ఈ ప్రశ్నల చుట్టే. దేశమంతా ఐపీసీ అమలవుతుంటే.. రాష్ట్రంలో మాత్రం వైసీపీ కోడ్‌తో ఉక్కుపాదం మోపుతున్నారన్నది ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ... అధికారపక్షం వహిస్తోందని... విపక్షాలైతే కాలు కదిపినా, నోరెత్తినా కేసులు, ఆంక్షలు, నిర్భంధాలతో నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. అసలు రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు కానీ, ఇలాంటి పాలన కానీ ఎవరైనా చూశారా? ఎందుకీ పరిస్థితి? కులాలు, రాజకీయాల పేరుతో తలోదారి వెళితే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? రాష్ట్ర ప్రజల ముందున్న కర్తవ్యం ఏంటి? ఒక్కతాటిపైకి రాకపోతే ప్రజలకు కలిగే నష్టం ఏంటి? ఇదీ నేటి ప్రతిధ్వని..